Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నేడు ఎంసీఆర్‌ టిమ్స్‌కు శ్రీకారం

Author MANA VISHWAM | 17 Aug 2026, 12:11 AM | HEALTH
నేడు ఎంసీఆర్‌ టిమ్స్‌కు శ్రీకారం

ప్రారంభోత్సవానికి ముస్తాబైన సనత్‌నగర్‌ ఆసుపత్రి

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ

శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వైద్యరంగంలో మరో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా. ఎంసీఆర్‌ టిమ్స్‌) సోమవారం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
ప్రారంభోత్సవ ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, కార్యక్రమ వేదికతోపాటు ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ప్రజల రాకపోకలకు చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆరోగ్యశాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, సమాచార పౌరసంబంధాల శాఖ, ట్రాఫిక్‌ పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా..

ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద రద్దీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. నగరంలో సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, సందర్శకులకు వేర్వేరుగా పార్కింగ్‌, రాకపోకల ఏర్పాట్లు చేయాలని సూచించారు.


భద్రతలో లోపాలకు తావొద్దు

ప్రారంభోత్సవం సందర్భంగా భద్రతలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి దామోదర స్పష్టం చేశారు. బందోబస్తుతోపాటు జనసందోహ నియంత్రణకు అవసరమైన సిబ్బందిని మోహరించాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
డా. ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.