Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఆలోచన కేసీఆర్‌ది.. ఆర్భాటం కాంగ్రెస్‌ది!

Author MANA VISHWAM | 17 Aug 2026, 10:56 PM | హైదరాబాద్
ఆలోచన కేసీఆర్‌ది.. ఆర్భాటం కాంగ్రెస్‌ది!

పూర్తిస్థాయి సేవల్లేకుండానే సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభమేమిటి?: హరీశ్‌రావు

రూ.వెయ్యి కోట్ల ఆసుపత్రిని ఓపీకే పరిమితం చేయడంపై ఆగ్రహం

పేరు మార్చితే కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిగిపోవు: కేటీఆర్‌

మిగతా టిమ్స్‌లు, వరంగల్‌ ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్‌


హైదరాబాద్‌, (మన విశ్వం): టిమ్స్‌ ఆసుపత్రుల ఆలోచన కేసీఆర్‌ది.. ప్రణాళిక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది.. నిధులు మంజూరు చేసిందీ అప్పటి ప్రభుత్వమే.. ఇప్పుడు ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోందని బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది. ప్రచారం మాత్రం కాంగ్రెస్‌ది. పేరు మార్చినంత సులువుగా చరిత్రను మార్చలేరు’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకముందే సనత్‌నగర్‌ టిమ్స్‌ను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. ప్రారంభోత్సవంపై చూపుతున్న శ్రద్ధ పూర్తిస్థాయి వైద్య సేవల కల్పనపై చూపాలని సూచించారు.

ఇవి కూడా చదవండి


మూడు టిమ్స్‌లకు రూ.2,679 కోట్లు

కరోనా అనంతరం భవిష్యత్‌ వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు మూడు వైపులా అల్వాల్‌, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లలో వెయ్యి పడకల చొప్పున టిమ్స్‌ ఆసుపత్రులను నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో వీటికి రూపకల్పన చేశారన్నారు.
2022 ఏప్రిల్‌ 26న మూడు ఆసుపత్రులకు ఒకేరోజు శంకుస్థాపన చేశారని, నిర్మాణానికి రూ.2,679 కోట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగాయని ఆరోపించారు. ప్రారంభోత్సవ తేదీలు మారాయే తప్ప ఆసుపత్రులను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు.


‘పేదలపై రుసుముల భారం వద్దు’

టిమ్స్‌లను పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. వైద్య సేవలకు ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా పేదలకు పైసా ఖర్చులేకుండా చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు.
అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌లతో పాటు వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌లో 2 వేల పడకల కొత్త బ్లాక్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా వీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.


‘కేసీఆర్‌ ఆనవాళ్లు తుడిచేయలేరు’

టిమ్స్‌లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో హైదరాబాద్‌ నగరానికి నలువైపులా వెయ్యి పడకల టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణానికి కేసీఆర్‌ ప్రభుత్వం బృహత్‌ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు.
‘‘కేసీఆర్‌ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్‌ సర్కారు వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి’’ అని ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. పేర్లు మార్చడం, ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల చరిత్రను మార్చలేరని స్పష్టం చేశారు.