Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పొమ్మనలేక.. పొగబెడుతున్నారా?

Author MANA VISHWAM | 21 Aug 2026, 02:15 PM | స్పెషల్ స్టోరీస్
పొమ్మనలేక.. పొగబెడుతున్నారా?

కూతురు వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయడంపై ప్రశ్నలు

మంత్రి ఏమీ అనకున్నా.. పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లేంటి?

‘పార్టీలు మారారు’ అంటున్న నేతల రాజకీయ గతంపైనా చర్చ

ఒక్కసారిగా ఎమ్మెల్యేల మూకుమ్మడి విమర్శల వెనుక మర్మమేంటి?

అవమానించి.. ఆమెంతట ఆమె వెళ్లిపోయేలా చేస్తున్నారా?


తెలంగాణ బ్యూరో, ఆగస్టు 21(మన విశ్వం) : వ్యాఖ్యలు చేసింది కుమార్తె.. వివరణ కోరింది తల్లిని! మాటలు సుస్మితవి.. రాజకీయ వేడి మాత్రం మంత్రి కొండా సురేఖ చుట్టూ! అంతటితో ఆగకుండా ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ కొందరు కాంగ్రెస్‌ నేతల నుంచి డిమాండ్లు! వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో ఇప్పుడు ఒకటే చర్చ..'సురేఖను పొమ్మనలేక పొగబెడుతున్నారా?'
పరకాల రాజకీయాలపై, సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేపాయి. పరకాల నుంచి పోటీపై ఆమె చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరడాన్ని ప్రశ్నించడం వివాదానికి కేంద్రంగా మారాయి. పార్టీ నాయకత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. చివరకు మంత్రి సురేఖ నుంచి వివరణ కోరే వరకు వ్యవహారం వెళ్లింది.


మాట సుస్మితది.. జవాబు సురేఖదా?

ఇక్కడే రాజకీయ వర్గాల్లో కీలక ప్రశ్న తలెత్తుతోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ చేశారని ఎలా భావిస్తారు? కుమార్తె మాటలను మంత్రి బహిరంగంగా సమర్థించారా? పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ సురేఖ స్వయంగా ఏమైనా వ్యాఖ్యానించారా? అలాంటిదేమీ లేకపోతే ఆమెనే బాధ్యురాలిని చేయడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సుస్మితకు సొంత రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా? తల్లి మంత్రి అయినంత మాత్రాన కుమార్తె మాట్లాడిన ప్రతి మాటకూ తల్లే బాధ్యత వహించాలా? ఇదే సూత్రాన్ని పార్టీలోని మిగతా నేతల కుటుంబ సభ్యుల విషయంలోనూ పాటిస్తారా? అన్న చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి


అదును చూసి దాడి?

సుస్మిత వ్యాఖ్యలతో దొరికిన అవకాశాన్ని సురేఖ వ్యతిరేక వర్గం అందిపుచ్చుకుందా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకరిద్దరు నేతల స్పందనతో సరిపెట్టకుండా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందుకొచ్చి కొండా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా? అన్నది చర్చనీయాంశమవుతోంది.
పార్టీ అంతర్గత వేదికపై పరిష్కరించాల్సిన వ్యవహారాన్ని బహిరంగ విమర్శల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? క్రమశిక్షణను గుర్తుచేయడమే లక్ష్యమైతే ఇంతటి రాజకీయ దాడి ఎందుకు? అనే ప్రశ్నలు కొండా అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి.


‘పార్టీలు మారారు’.. మరి మిగతావారు?

కొండా సురేఖ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఆమె నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చారంటూ విమర్శలు చేయడం మరో చర్చకు తెరతీసింది. మరి ఈ విమర్శలు చేస్తున్న వారంతా మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉన్నారా? ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నేతల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారే లేరా? ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న వారిలో పార్టీలు మారిన నేతలు ఎంతమంది? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
పార్టీ మార్పులే ఒక నేత నిబద్ధతకు కొలమానమైతే.. ఆ కొలమానం ఒక్క సురేఖకేనా? అందరికీ వర్తింపజేస్తారా? అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


బీసీ మహిళా మంత్రిపైనే ఎందుకింత గురి?

ఈ వివాదానికి సామాజిక కోణమూ తోడవుతోంది. బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిగా ఉన్న సురేఖను లక్ష్యంగా చేసుకుని వరుసగా విమర్శలు రావడంపై ఆమె అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విభేదాలు ఉంటే పార్టీ వేదికలపై తేల్చుకోవచ్చు గానీ.. మూకుమ్మడిగా బహిరంగ విమర్శలు చేయడం ద్వారా ఆమెను ఒంటరి చేస్తున్నారనే భావన ఏర్పడితే అది కాంగ్రెస్‌కే ఇబ్బందికరంగా మారే అవకాశముందన్న అభిప్రాయం వినిపిస్తోంది.


వెళ్లగొట్టకుండా.. వెళ్లిపోయేలా?

అసలు చర్చంతా ఇక్కడే కేంద్రీకృతమవుతోంది. సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే వచ్చే రాజకీయ, సామాజిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. వరుస వివాదాలు, నోటీసులు, బహిరంగ విమర్శలతో ఆమెపై ఒత్తిడి పెంచి తనంతట తానే తప్పుకునే పరిస్థితి కల్పిస్తున్నారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి అధికారిక ఆధారాలేవీ లేకపోయినా తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
సుస్మిత వ్యాఖ్యలపై పార్టీకి అభ్యంతరాలుంటే వాటిపై వివరణ కోరడం ఒక విషయం. కానీ ఆ వివాదం మంత్రి సురేఖ పదవి వరకు చేరడం మరో విషయం. అందుకే ఇప్పుడు తెలంగాణ లో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే...
మాట్లాడింది సుస్మిత అయితే.. టార్గెట్ సురేఖ ఎందుకు?
క్రమశిక్షణ చర్యేనా..? లేక 'పొమ్మనలేక పొగబెట్టే' రాజకీయమా..?