Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట

Author MANA VISHWAM | 22 Aug 2026, 09:02 PM | TELANGANA
ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవల విషయంలో ఊరట కలిగించే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. నూతన విధానాలతో రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎంపానెల్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు పొందేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈహెచ్‌ఎస్‌ అమలుపై తెలంగాణ సచివాలయంలో ఎంప్లాయీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టీజీ-జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ట్రస్ట్‌ బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ స్టేట్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌, అపోలో, కాంటినెంటల్‌, యశోద, కిమ్స్‌ తదితర కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం అమలు, వైద్య సేవలు, క్లెయిమ్‌ల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు.


ఆసుపత్రుల నుంచి సానుకూల స్పందన

కొత్త ఈహెచ్‌ఎస్‌ను తక్షణమే అమలు చేసేందుకు ఆసుపత్రుల సంఘం, కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంపానెల్‌ చేసిన ఆసుపత్రుల్లో అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. చికిత్స కోసం ముందుగా పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన పరిస్థితిని నివారించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు.

ఇవి కూడా చదవండి


క్లెయిమ్‌ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

కొత్త ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన మార్గదర్శకాల్లో ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్‌, చికిత్స విధానాలు, క్లెయిమ్‌ల పరిష్కారం, రోగులకు అందించాల్సిన సేవలపై స్పష్టత ఇచ్చారు. లబ్ధిదారులకు సకాలంలో చికిత్స అందడంతో పాటు క్లెయిమ్‌లు త్వరగా పరిష్కారమయ్యేలా వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు.
పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎంపానెల్‌ ఆసుపత్రులను ట్రస్ట్‌ కోరింది. కొత్త ఈహెచ్‌ఎస్‌తో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ, పెన్షనర్‌ కుటుంబాలకు ఆరోగ్యపరంగా మరింత భరోసా లభించనుంది.