Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కొండా సురేఖ షోకాజ్‌ నోటీసుపై రేవంత్‌రెడ్డి స్పందన

Author MANA VISHWAM | 24 Aug 2026, 10:33 PM | హైదరాబాద్
కొండా సురేఖ షోకాజ్‌ నోటీసుపై రేవంత్‌రెడ్డి స్పందన

కాంగ్రెస్‌లో పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసిన వ్యవహారంపై ఆయన స్పందించారు. పార్టీ నిబంధనలు అందరికీ సమానంగానే వర్తిస్తాయని పేర్కొన్నారు.
కొండా సురేఖకు ఇచ్చిన నోటీసుపై తాను ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగ వేదికలపై చర్చించబోనని చెప్పారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం పరిధిలో ఉందని, వివరణను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది ఆ సంఘమేనని స్పష్టం చేశారు.


సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం

ఇటీవల గీసుగొండలో జరిగిన కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసు ఇచ్చి వివరణ కోరింది.

ఇవి కూడా చదవండి


వివరణ ఇచ్చిన సురేఖ

షోకాజ్‌ నోటీసుకు కొండా సురేఖ ఇప్పటికే లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమాధానాన్ని క్రమశిక్షణా సంఘం పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యక్తులు ఎవరైనా పార్టీ క్రమశిక్షణకు లోబడాల్సిందేనని ఆయన స్పష్టం చేయడంతో.. సురేఖ వివరణపై క్రమశిక్షణా సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.