Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తుమ్మిడిహట్టిపై ఢిల్లీలో కీలక భేటీ

Author MANA VISHWAM | 27 Aug 2026, 10:52 PM | హైదరాబాద్
తుమ్మిడిహట్టిపై ఢిల్లీలో కీలక భేటీ

ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంలో కీలక ముందడుగు పడనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబరు 1న ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో ఈ భేటీ జరగనుంది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొంతకాలంగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య చర్చలు నిర్వహించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. అనంతరం ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు కూడా రేవంత్‌రెడ్డి లేఖ రాసి కేంద్రం చొరవ చూపాలని కోరారు.
బ్యారేజీ ఎత్తే ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని తెలంగాణ భావిస్తోంది. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని, భారీ పంపులపై ఆధారపడాల్సి రావడంతో విద్యుత్‌ వ్యయం గణనీయంగా పెరుగుతుందని కేంద్రానికి వివరించింది.
152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తక్కువ విద్యుత్‌ వ్యయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంచినా అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కేంద్రానికి నివేదించింది.
వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడంలో తుమ్మిడిహట్టి కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1న జరిగే సమావేశంలో బ్యారేజీ ఎత్తు, ముంపు, సాంకేతిక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.