Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘కొండా’ తాడోపేడో!

Author MANA VISHWAM | 03 Sep 2026, 01:59 PM | స్పెషల్ స్టోరీస్
‘కొండా’ తాడోపేడో!

ఫైర్‌బ్రాండ్‌ నిర్ణయంపై తెలంగాణలో ఉత్కంఠ

రాజీనామా చేయాలంటూ అధిష్ఠానం సంకేతాలిచ్చినట్లు ప్రచారం

ససేమిరా అంటే బర్తరఫ్‌?.. కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్‌ పెద్దలు?

మంత్రి పదవితోనే ఆగుతారా?.. మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా?

‘నాపైనే చర్యలెందుకు?’ అంటూ ఇప్పటికే అధిష్ఠానాన్ని నిలదీసిన సురేఖ

బీసీ అస్త్రం ప్రయోగిస్తారా?.. ‘కొండా’ తదుపరి అడుగుపై పార్టీల చూపు


తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్‌ 3 (మన విశ్వం): తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ఉత్కంఠ..' కొండా ' ఏం చేయబోతున్నారు? మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తారా? లేక చివరి క్షణంలో రాజీ కుదురుతుందా? ఫైర్‌బ్రాండ్‌ మంత్రి కొండా సురేఖ రాజకీయ భవితవ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం సురేఖకు సంకేతాలిచ్చినట్లు రాజకీయ, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకుంటే కేబినెట్‌ నుంచి తప్పించే వరకు వ్యవహారం వెళ్లొచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉండటంతో ఇప్పుడు అందరి చూపు సురేఖ నిర్ణయంపైనే ఉంది.


నిన్న ‘తగ్గను’.. నేడు ఏం చేస్తారు?

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో అధిష్ఠానం ముందు వివరణ ఇచ్చిన తర్వాత కూడా సురేఖ వెనక్కి తగ్గలేదు. తనపై చర్య తీసుకునేముందు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలనూ పరిశీలించాలని ప్రశ్నించారు. ‘పదేళ్లు తానే సీఎం అని ఎలా చెబుతారు?’ అంటూ నిలదీశారు. ఇతర మంత్రులపై వచ్చిన ఆరోపణల సంగతేంటి? బీసీలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అంటూ తన వాదనను బలంగా వినిపించారు.
ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా? లేక ‘తప్పిస్తే తప్పించుకోండి’ అన్నట్లుగా ఎదురెళ్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది.


పదవి పోతే.. పోరు మొదలవుతుందా?

అసలు రాజకీయ కథ మంత్రి పదవితోనే ముగుస్తుందా? అన్నదే కీలకం. తప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక తనను లక్ష్యంగా చేసుకున్నారంటూ పోరుబాట పడతారా?
ఇప్పటికే బీసీ అంశాన్ని సురేఖ తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనపై చర్యను బీసీ మహిళకు జరిగిన అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్తే వ్యవహారం కొత్త రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.


వరంగల్‌లోనూ ప్రకంపనలు?

కొండా నిర్ణయం ఉమ్మడి వరంగల్‌ రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశముంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కొండా దంపతులకు ప్రత్యేక అనుచరవర్గం ఉంది. సురేఖను కేబినెట్‌ నుంచి తప్పిస్తే అసంతృప్తి ఆమెకే పరిమితమవుతుందా? లేక స్థానిక కాంగ్రెస్‌ సమీకరణాలనూ కదిలిస్తుందా? అన్నది ఆసక్తికరం.


రేవంత్‌ వర్సెస్‌ కొండా?

తనపై చర్య తీసుకునేముందు సీఎంపైనా చర్య తీసుకోవాలన్న సురేఖ వ్యాఖ్యలతో వ్యవహారం క్రమశిక్షణ వివాదాన్ని దాటి రాజకీయ ఆధిపత్య పోరుగా మారిందన్న చర్చ మొదలైంది.
దీంతో అధిష్ఠానం నిర్ణయం సురేఖ మంత్రి పదవినే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వం, క్రమశిక్షణ విషయంలోనూ కీలక సంకేతం ఇవ్వనుంది.


ఇప్పుడు బంతి ‘కొండా’ కోర్టులో!

రాజీనామా చేస్తారా?.. ఎదురెళ్తారా?.. బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తారా?.. లేక మరో సంచలన నిర్ణయం ప్రకటిస్తారా?
కాంగ్రెస్‌తోపాటు ప్రత్యర్థి పార్టీల చూపూ ఇప్పుడు సురేఖ తదుపరి అడుగుపైనే ఉంది.
పదవి పోతుందా అన్నది ఒక ప్రశ్న.. పొతే' కొండా ' ఏం చేస్తారన్నదే అసలు రాజకీయ సంచలనం!