Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నీట్ రీ పరీక్ష ఆన్సర్ కీ విడుదల.. జూన్ 28 వరకు అభ్యంతరాలకు అవకాశం

Author MANA VISHWAM | 26 Jun 2026, 10:43 PM | NATIONAL
నీట్ రీ పరీక్ష ఆన్సర్ కీ విడుదల.. జూన్ 28 వరకు అభ్యంతరాలకు అవకాశం

నీట్ యూజీ–2026 రీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన రీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని భావించే అభ్యర్థులకు అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్‌టీఏ కల్పించింది. ఈ నెల జూన్ 28 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపింది. ప్రతి ప్రశ్నపై సవాలు చేయడానికి రూ.200 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా తప్పనిసరిగా జత చేయాలని సూచించింది.
ఒక్కసారి మాత్రమే అభ్యంతరాలను సమర్పించే అవకాశం ఉంటుందని, దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎలాంటి మార్పులు చేయలేమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అందువల్ల అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది.
అందిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అభ్యంతరాలు సమర్థనీయమైనవిగా తేలితే సంబంధిత అభ్యర్థులకు చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేసి, దాని ఆధారంగానే నీట్ యూజీ–2026 రీ పరీక్ష ఫలితాలను ప్రకటించనుంది. తుది ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కూడా స్పష్టం చేసింది.
కటాఫ్‌పై అంచనాలు.. అధికారిక ప్రకటనకే ప్రాధాన్యం
నీట్ స్కోర్ల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై ఇప్పటికే పలు అంచనాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 650–720 మార్కులు సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, 600–649 మార్కులు సాధించిన వారికి కూడా అవకాశాలు ఉండొచ్చని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
అయితే తుది కటాఫ్‌లు రాష్ట్రాల వారీ రిజర్వేషన్ విధానం, అభ్యర్థుల సంఖ్య, మొత్తం ఫలితాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మార్కుల అంచనాలను సూచికగా మాత్రమే పరిగణించాలని, అధికారిక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.