Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

లాభాల బాటలో దూసుకెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ

Author MANA VISHWAM | 29 Jun 2026, 09:42 AM | హైదరాబాద్
లాభాల బాటలో దూసుకెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ

కొన్నేళ్ల పాటు వేల కోట్ల రూపాయల నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు లాభాల బాటలో వేగంగా దూసుకెళ్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం, సంస్థ చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యలు కలిసి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపర్చాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,059.27 కోట్ల మిగులు సాధించి చరిత్రలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న ఆర్టీసీ యాజమాన్యం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,118.86 కోట్ల నికర మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాది మొత్తం ఆదాయం రూ.9,639.54 కోట్లకు చేరుతుందని, వ్యయాలు రూ.8,520.68 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేసింది.

మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఆదాయం

2023 డిసెంబరులో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 67 శాతం నుంచి 98 శాతానికి చేరుకుంది. మహిళలకు జారీ చేసే జీరో టికెట్ల విలువను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లిస్తుండటంతో సంస్థకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

వ్యయ నియంత్రణతో మెరుగైన ఫలితాలు

ఆదాయం పెరగడంతో పాటు వ్యయాలను అదుపులో ఉంచేందుకు కూడా ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. టోల్, సేఫ్టీ, రౌండప్ తదితర అంశాలపై టికెట్ ఛార్జీల్లో మార్పులు చేసి ఆదాయ వనరులను పెంచింది. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో వేతన వ్యయం తగ్గింది. సొంత బస్సుల స్థానంలో అద్దె బస్సుల వినియోగాన్ని పెంచడం ద్వారా నిర్వహణ ఖర్చులను కూడా నియంత్రించింది.

వేతన సవరణ ప్రభావం

ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేసినప్పటికీ, పెరిగిన వేతనాల ఆర్థిక భారం పదవీ విరమణ సమయంలో చెల్లించే విధంగా నిర్ణయించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థపై అదనపు భారాన్ని తగ్గించింది. ఈ నిర్ణయం కూడా 2025-26లో భారీ మిగులు నమోదుకు దోహదపడిన ప్రధాన కారణాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.