Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​అంగన్‌వాడీలకు కేంద్ర సాయం పెంచాలి

Author MANA VISHWAM | 03 Jul 2026, 09:40 PM | TELANGANA
​అంగన్‌వాడీలకు కేంద్ర సాయం పెంచాలి

కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క భేటీ

​చిన్నారుల అల్పాహార పథకానికి నిధులివ్వాలని విజ్ఞప్తి

​బాలికల్లో రక్తహీనత నివారణకు రూ.100 కోట్లు కేటాయించాలి

తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వీరికి మరింత మెరుగైన సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీతక్క, వాటికి సంబంధించిన వినతిపత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు.

​అల్పాహార పథకానికి భరోసా కల్పించండి

ఇవి కూడా చదవండి

​రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), పాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. బాలల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతోందని పేర్కొంటూ, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు.

​వేతనాల్లో కేంద్రం వాటా పెంచాలి

​అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం 20 శాతం మాత్రమే భరిస్తోందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా కేంద్రం తన వాటాను గణనీయంగా పెంచి, రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

​అనీమియా నివారణకు రూ.100 కోట్లు ఇవ్వండి

​టీనేజ్ బాలికల్లో రక్తహీనత (అనీమియా) సమస్యను అరికట్టేందుకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఆహార పంపిణీ కొరకు రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని మంత్రి సీతక్క కోరగా, దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.