Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దు!

Author MANA VISHWAM | 03 Jul 2026, 09:52 PM | TELANGANA
​నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దు!

రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడే యువతలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాలకు చెందినవారేనని, రేయింబవళ్లు కష్టపడి చదువుతున్న వారి భవిష్యత్తుతో ఆటలాడొద్దని సూచించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే తెలంగాణ ఉద్యమ నినాదాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

​హామీలు ఇక్కడే.. భర్తీ ఎక్కడ?

​రాష్ట్రంలో 17 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించినా, ఇప్పటివరకు వాటిని భర్తీ చేయడంలో తీవ్రమైన అన్యాయం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. వేలాది పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడతామని స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ప్రకటించినా ఆచరణలో శూన్యమని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

బిఆర్ఎస్ హయాంలో ​ఎలాంటి ముందస్తు హామీలు ఇవ్వకపోయినా 47 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. మొత్తం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,000కు పైగా నియామకాలు పూర్తి చేశాం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని అన్నారు

​‘జాబ్ డిక్లరేషన్’ ఒక మోసం!

​ఎన్నికల ముందు యువతను ఆకట్టుకునేందుకు ‘జాబ్ డిక్లరేషన్’ పేరిట కాంగ్రెస్ ఊదరగొట్టిందని, అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.