Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు

Author MANA VISHWAM | 05 Jul 2026, 03:36 PM | TELANGANA
​హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు

​మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్రానికి విజ్ఞప్తి..

టిఓఆర్ ఖరారులో జాప్యంపై సీఎం ఆందోళన

​హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు - Additional Image


హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు తక్షణమే అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు రాశారు.
​ఇటీవల జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాలను గుర్తు చేస్తూ, ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

​సమావేశ నిర్ణయాలను అమలు చేయాలి..

ఇవి కూడా చదవండి

​హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు - Additional Image

​గత నెలలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాల ప్రకారం.. మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం , అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ కు అప్పగించాలని ఉమ్మడిగా అంగీకరించారు. అలాగే ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను కూడా దీనికే అప్పగించాల్సి ఉంది.
​అయితే, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేయడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

​జాప్యం జరిగితే ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం!

​ఈ కాలయాపన వల్ల మెట్రో ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంతేకాకుండా, ఫేజ్-II డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమై, ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిపోతుందని లేఖలో పేర్కొన్నారు.
​"హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదు."అని రేవంత్ రెడ్డి అన్నారు.


​కేంద్ర మంత్రుల వ్యక్తిగత జోక్యానికి విజ్ఞప్తి

​ఈ అంశంలో కేంద్ర మంత్రులు ఇద్దరూ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలైతేనే.. మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు, మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.