Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సిఎం పర్యటనకు ములుగు ముస్తాబు

Author MANA VISHWAM | 06 Jul 2026, 10:40 PM | ములుగు
సిఎం పర్యటనకు ములుగు ముస్తాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ములుగు జిల్లాలో తలపెట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి ఆమె వివిధ శాఖల ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ప్రతిపాదనలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

​సమన్వయంతోనే లక్ష్య సాధన..

జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ (ఐడీఓసీ), మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వీటితో పాటు పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్, కరకట్టల నిర్మాణం, పంచాయతీరాజ్ రహదారుల పనుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ శాశ్వత అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌ అమలు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రామచంద్రపురం భూసర్వే, పైలాన్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

​రైతాంగానికి ఇబ్బందులు కలగొద్దు..

ప్రస్తుత వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా నల్లబజారుకు తరలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం సుమారు రూ. 6,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

​ఒకే శిలాఫలకంపై వివరాలు..

జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రధాన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకే శిలాఫలకంపై పొందుపరిచి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా యంత్రాంగం కదలాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎక్కడా అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పనుల పురోగతిని మంత్రికి వివరించారు.