Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఆడబిడ్డ ఆస్తికి.. ‘రెవెన్యూ’ ఎసరు! ​ సంగెం తహసీల్దార్‌ కార్యాలయంలో బరితెగింపు రిజిస్ట్రేషన్

Author MANA VISHWAM | 09 Jul 2026, 09:16 AM | వరంగల్
ఆడబిడ్డ ఆస్తికి.. ‘రెవెన్యూ’ ఎసరు!  ​ సంగెం తహసీల్దార్‌ కార్యాలయంలో బరితెగింపు రిజిస్ట్రేషన్

రెండో భార్య కూతురికి తెలీకుండానే.. మొదటి భార్య కొడుకు పేరిట 4 ఎకరాలు బదలాయింపు

వారసత్వ భూమిని విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్

​గతంలో పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా.. కళ్లు మూసుకున్న అధికారులు?

​తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితురాలి కన్నీటి ఆవేదన.. కలెక్టర్‌కు వేడుకోలు

​వరంగల్ ప్రతినిధి జులై 8(మన విశ్వం):

ధరణి పోయి ‘భూభారతి’ వచ్చినా, రిజిస్ట్రేషన్ల నిబంధనలు మార్చినా క్షేత్రస్థాయిలో కొంతమంది రెవెన్యూ అధికారుల ‘మామూళ్ల’ మౌఢ్యం మారడం లేదు. వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసేముందు కనీస విచారణ లేదు.. కుటుంబ సభ్యులకు, హక్కుదారులకు ముందస్తు నోటీసులు లేవు.. చట్టబద్ధమైన వారసత్వ హక్కులను కాలరాస్తూ, కళ్లెదుటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతున్నా అధికారులు కళ్లు అప్పగించి చూశారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పెద్దమనుషుల సమక్షంలో జరిగిన అధికారిక ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ...వారసత్వ భూమిని తహసీల్దార్ ఏకపక్షంగా రిజిస్ట్రేషన్ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి


​ఆసరా చూసుకున్నారు.. రిజిస్ట్రేషన్ ‘కానిచ్చేశారు’!

​బాధిత యువతి కథనం ప్రకారం.. సంగెం మండలం ఆశాలపల్లి గ్రామానికి చెందిన మాడిశెట్టి అంజలి అనే యువతికి, ఆమె తండ్రి సారంగంకు మధ్య గతంలోనే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆస్తి పంపకాల ఒప్పందం జరిగింది. కాపుల కనపర్తి రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్లు 307/A/2, 348/D, 346/B1/A,348/A /2, 349/C /1 లలో ఉన్న భూమిలో అంజలికి 2 ఎకరాల 13 గుంటలు ఇస్తున్నట్లు పెద్దమనుషుల సమక్షంలో రాజీ పత్రం రాసుకున్నారు. అప్పట్లో అంజలి మైనర్ కావడంతో, ఆమె మేజర్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేస్తామని తండ్రి ఒప్పుకున్నాడు.
​కట్ చేస్తే.. ఈ నెల అంటే జులై 7వ తేదీన బాధితురాలు అంజలి తన అమ్మమ్మగారి ఇంట్లో ఉన్న తరుణాన్ని ఆసరాగా తీసుకుని, తండ్రి సారంగం తన మొదటి భార్య కొడుకైన నితీష్ పేరు మీద ఆ భూమినంతటినీ గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసేశాడు. నిబంధనలకు విరుద్ధంగా, వారసత్వంగా తనకు రావాల్సిన భూమిని తహసీల్దార్ ఎటువంటి విచారణ, నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితురాలు ఆరోపించింది.


​చట్టం ఏం చెబుతోంది? అధికారులు ఏం చేశారు?


చట్ట ప్రకారం పిత్రార్జిత ఆస్తిపై కొడుకులతోపాటు కూతుళ్ళకు సమాన హక్కు ఉంటుంది. ఒక తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు లీగల్ హెయిర్ (వారసత్వ) హక్కుల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ, రెండవ భార్య కూతురు ప్రమేయం లేకుండా, ఆమె సంతకం లేకుండా, కనీసం విచారణ చేయకుండా వారసత్వ భూమిని మొత్తం కొడుకు పేరిట బదలాయిస్తుంటే తహసీల్దార్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? గతంలో జరిగిన ఒప్పంద రికార్డులను ఎందుకు పరిశీలించలేదు? కేవలం ‘చేతులు మారిన’ లావాదేవీల వల్లే అధికారులు కళ్ళు మూసుకున్నారా? అనే అనుమానాలను బాధితురాలు వ్యక్తం చేసింది.

​కార్యాలయం ముందే కన్నీరు... కలెక్టర్‌కు వేడుకోలు!

​"నా ప్రమేయం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే రద్దు చేయాలి. సదరు సర్వే నెంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. తహసీల్దార్ నిర్లక్ష్యం వల్లే నాకు అన్యాయం జరిగింది. వారసత్వ భూమిని కనీసం విచారణ చేయకుండా, నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఒక్కరికే పట్టా చేశారు.ఇదే విషయమై బుధవారం పట్టాను రద్దు చేయాలని కోరితే.. 'ఏంచేసుకుంటావో చేసుకో, ఇన్ని రోజులు ఏంచేసావ్, నీ తెలివి ఎక్కడ పోయింది?' అని తహసీల్దార్ దబాయిస్తున్నారు" అంటూ బాధితురాలు అంజలి కన్నీటి పర్యంతమైంది. వరంగల్ ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ పట్టాను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.