Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ధాన్యం రవాణాలో ‘కోట్ల’ కుంభకోణం!

Author MANA VISHWAM | 14 Jul 2026, 02:17 PM | హన్మకొండ
ధాన్యం రవాణాలో ‘కోట్ల’ కుంభకోణం!

​లారీలు పెట్టలేదు.. ధాన్యం తరలించలేదు.. కానీ బిల్లులు మాత్రం క్లియర్!

​ప్రభుత్వానికి, రైతులకు కాంట్రాక్టర్ల భారీ మోసం

​పౌరసరఫరాల శాఖ అధికారుల అండదండలతోనే అక్రమార్జన?

​హన్మకొండ జిల్లాలో వెలుగుచూసిన రవాణా మాఫియా గుట్టు!


​రైతు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు చేర్చే ప్రక్రియలో కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో భారీ అవినీతి చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లారీలు పెట్టకుండా, అసలు ధాన్యాన్ని రవాణా చేయకుండానే రికార్డుల్లో మాత్రం లారీలు నడిచినట్లు చూపిస్తూ కాంట్రాక్టర్ కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి . అధికారుల అండదండలతోనే గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

​రికార్డుల్లో మాత్రమే లారీలు.. క్షేత్రస్థాయిలో రైతుల ట్రాక్టర్లే శరణ్యం!

​హన్మకొండ జిల్లావ్యాప్తంగా ప్రతి సీజన్‌లోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు రవాణా బాధ్యతలు అప్పగిస్తారు. అయితే, జిల్లావ్యాప్తంగా సుమారు 60శాతం మంది రైతులు ప్రతీ సీజన్ లో తమ సొంత వాహనాల్లోనే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.జిల్లాలో ప్రధానంగా కమలాపూర్ సెక్టార్ లో గత 3 సంవత్సరాలనుండి ప్రతి సీజన్‌లోనూ అసలు లారీల అవసరమే లేకుండానే 80శాతం మంది రైతులు తమ సొంత ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు చేర్చారు. లారీల్లో కాకుండా రైతులే సొంత వాహనాల్లో ధాన్యం తీసుకొస్తే, పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని 'ఓపిఎంఎస్ 'వివరాల్లో ఏమని నమోదు చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. లారీలు రాకపోయినా, రవాణా జరగకపోయినా అధికారులు ఏటా ఒక్కో సీజన్‌కు రూ లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును సదరు కాంట్రాక్టర్ ఖాతాలోకి ఎలా మళ్లించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

​రవాణా ఛార్జీల్లోనూ భారీ కోత.. రైతులకు అన్యాయం

​కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీల్లో తరలించడానికి కాంట్రాక్టర్ కు ప్రభుత్వం క్వింటాలుకు సుమారుగా రూ. 32రూపాయల వరకు చెల్లిస్తోంది. కానీ, లారీలు పెట్టని కమలాపూర్ సెక్టార్ కాంట్రాక్టర్.. సొంతంగా తమ ట్రాక్టర్ లలో ధాన్యం తరలించిన రైతులు రవాణా ఛార్జీల గురించి అడగగా రైతులకు ఏదో తమ జేబుల్లోంచి ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ క్వింటాలుకు గరిష్టంగా రూ. 15 రూపాయలు మాత్రమే చెల్లించిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.​తాము లారీలు పెట్టకపోయినా, రవాణా చేయకపోయినా.. ప్రభుత్వం ఇచ్చే పూర్తి స్థాయి బిల్లులను మాత్రం అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు 3సంవత్సరాలనుండి స్వాహా చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

​అధికారుల ‘సహకారం’ వెనుక మర్మమేంటి?

హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ సెక్టార్ లో ​ధాన్యం రవాణా కాంట్రాక్టర్ లారీల్లో ధాన్యం తరలించడం లేదనే విషయం క్షేత్రస్థాయి అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ స్పష్టంగా తెలిసినప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో పౌరసరఫరాల శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. కళ్లు మూసుకుని మరీ బిల్లులు ఎలా క్లియర్ చేశారో, ఈ అవినీతి భాగస్వామ్యంలో ఎవరెవరికి ఎంత వాటా అందిందో విచారణ జరిపితేనే వాస్తవాలు బయటికొస్తాయని, ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.