Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​‘మన విశ్వం’ దెబ్బకు గుండెల్లో రైళ్లు!అధికారి కుర్చీకే ఎసరు పెట్టిన రవాణా స్కాం

Author MANA VISHWAM | 18 Jul 2026, 11:47 AM | హన్మకొండ
​‘మన విశ్వం’ దెబ్బకు గుండెల్లో రైళ్లు!అధికారి కుర్చీకే ఎసరు పెట్టిన రవాణా స్కాం

​కమలాపూర్ సెక్టార్ ధాన్యం రవాణా స్కామ్‌పై సర్కార్ నజర్?

​లారీలు నడవలేదు.. బిల్లులు మాత్రం రూ. 4 కోట్లు చెల్లించేశారు!

​హన్మకొండ పౌరసరఫరాల సంస్థ అధికారుల ‘ముడుపుల’ భాగోతం.

​విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సదరు అధికారి కుర్చీ ఖాళీ కావడం ఖాయం?

​కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.

​రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ సెక్టార్‌లో జరిగిన ‘ధాన్యం రవాణా స్కాం’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమాలపై 'మన విశ్వం' వరుస కథనాలతో క్షేత్రస్థాయి నిజాలను వెలుగులోకి తేవడంతో.. అటు పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఇటు ధాన్యం రవాణా కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండేళ్లుగా అణాపైసా పని చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లించారు అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి


​కాగితాల్లోనే రవాణా.. ఖాతాల్లోకి కోట్లు!

​కమలాపూర్ సెక్టార్‌లో గత రెండు సంవత్సరాలుగా అసలు లారీల్లో ధాన్యాన్ని రవాణా చేయనే లేదు. కానీ, హన్మకొండ పౌరసరఫరాల సంస్థ అధికారులు మాత్రం రూ. కోట్లు కుమ్మరించడానికి వెనుకాడలేదు.'వెంకటేశ్వరా లారీ ట్రాన్స్ పోర్ట్' సంస్థకు సుమారు రూ. 4 కోట్ల మేర రవాణా బిల్లులను చకచకా చెల్లించేశారు. క్షేత్రస్థాయిలో రవాణా జరగకపోయినా, లారీలు కదలకపోయినా.. కాగితాల్లోనే అంతా సజావుగా సాగిపోయినట్లు రికార్డులు సృష్టించడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల జేబులు నిండటంతోనే, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


​ఆ అధికారి కుర్చీకే ఎసరు?

ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయి ‘విజిలెన్స్ విచారణ’కు ఆదేశిస్తే.. హన్మకొండ పౌరసరఫరాల సంస్థకు చెందిన ఒక ముఖ్య అధికారి కుర్చీకే ఎసరు రావడం ఖాయమని కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తప్పు చేసిన అధికారులు, కాంట్రాక్టర్ బాగోతం బట్టబయలు కాకుండా ఉండేందుకు ఇప్పుడు తెరవెనుక రాయబారాలు, ఒత్తిళ్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

​బట్టబయలు కానున్న అధికారులు, కాంట్రాక్టర్ల బంధం!

​‘మన విశ్వం’ కథనాలతో ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగంలో అలజడి మొదలైంది. ప్రభుత్వం కనుక విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే.. ఈ రెండేళ్ల కాలంలో జరిగిన రవాణా రికార్డులు, వే-బిల్లులు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలన్నీ బయటకు రానున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల అపవిత్ర బంధం పూర్తిగా బట్టబయలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ ‘కమలాపూర్ సెక్టార్ స్కాం’పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.